170 మందితో ప్రయాణం.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు రెండు టైర్లు
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 1:47 AM GMT170 మందితో ప్రయాణం.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు రెండు టైర్లు
తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా బస్సు రెండు టైర్లు ఊడిపోయాయి. అయితే.. బస్సు మాత్రం బోల్తా పడలేదు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది
తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు అవుతున్న తర్వాత నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్‌కు వస్తున్న బస్సులో 170 మంది ప్రయాణికులు ఎక్కారు. ఓవర్ లోడ్ అయిన బస్సు జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివారుకు రాగానే ప్రమాదానికి గురైంది. బస్సు వెనుకాల ఉన్న రెండు సైడ్ టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సు బోల్తా పడకుండా చూసుకున్నాడు. ఇక ప్రయాణికులు ఈ ప్రమాద సమయంలో భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై బస్సు డ్రైవర్, కండక్టర్‌పై కొందరు మండిపడుతున్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే ఎవరేం చేస్తారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక డిమాండ్ ఉన్నరూట్లలో ప్రభుత్వం వెంటనే కొత్త సర్వీసులను వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.