తెలంగాణలో కరోనా టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యే
Jagtial MLA DR Sanjay kumar taken covid vaccine. తెలంగాణలో కరోనా టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యే.
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2021 5:18 PM ISTదేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా.. కేంద్రం అత్యవసరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వారానికి నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అందరు ప్రజాప్రతినిధుల కంటే ముందే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణినీ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్ వారియర్స్‌గా ఉన్న వారికి టీకా వేస్తున్న నేపథ్యంలో వైద్యుల కోటాలో ఆయన టీకా వేయించుకున్నట్లు తెలిపారు. చాలామంది వ్యాక్సిన్ వికటించి మృత్యువాత పడుతున్నట్లు వదంతులు వస్తున్నాయని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా వారు వివిధ రోగాల కారణాలు వల్ల చనిపోవచ్చు దానికి వ్యాక్సిన్ తీసుకుంటేనే చనిపోయినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఈ వదంతులను నమ్మవద్దని ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా..రెండో విడతలో ప్రజా ప్రతినిధులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.