జగిత్యాల: కింగ్‌ ఫిషర్‌ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు

జగిత్యాల పట్టణంలో కింగ్‌ ఫిషర్‌ బీర్లు అమ్మడం లేదని కింగ్‌ ఫిషర్‌ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ

By అంజి  Published on  27 Feb 2023 1:45 PM IST
Jagtial, Kingfisher beers, Jagtial collector, Prajavani

కింగ్‌ ఫిషర్‌ బీర్‌

జగిత్యాల పట్టణంలో కింగ్‌ ఫిషర్‌ బీర్లు అమ్మడం లేదని కింగ్‌ ఫిషర్‌ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లతకు బీరం రాజేష్‌ అనే వ్యక్తి వినతి పత్రం సమర్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వినతిపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం విక్రయ దుకాణల(వైన్స్‌, బార్‌)లో కింగ్‌ ఫిషర్‌ కంపెనీకి చెందిన బీర్లు అమ్మడం లేదని రాజేష్‌ తన వినతి పత్రంలో పేర్కొన్నాడు.

అనుమతి పొందే సమయంలో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పి, అనుమతి పొందిన తర్వాత నాణ్యత లేని బీర్లు అమ్ముతున్నారని చెప్పాడు. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుందని చెప్పాడు. అన్ని రకాల బీర్లు అమ్మాల్సిన దుకాణందారులు కొన్ని నాణ్యత లేని బీర్లు అమ్ముతుండటంతో.. యువకులు, మద్యం సేవించిన వారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆ బీర్లను కొనుక్కుని వచ్చే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నారని తన లేఖలో రాజేష్‌ పేర్కొన్నాడు.

కొందరు బెల్టు షాపుల్లో అధిక ధరలకు కేఎఫ్‌ బీర్లు కొంటున్నారని చెప్పాడు. ఇక్కడ వైన్స్‌, బార్‌ షాపుల్లో దొరకని కేఎఫ్‌ బీర్లు దుకాణాల్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయని రాజేష్‌ ప్రశ్నించాడు. బెల్టు షాపుల్లో అమ్ముతున్న కేఎఫ్‌ బీర్లు నిజమైనవేనా? లేకా కృత్రిమంగా తయారు చేసి విక్రయిస్తున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి ఆదాయంలో నష్టం వచ్చే కార్యక్రమం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. జగిత్యాల పట్టణంలో అన్ని రకాల బీర్లు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని బీరం రాజేష్‌ విజ్ఞప్తి చేశాడు.

Next Story