శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ నజర్, మూడో రోజు హైదరాబాద్‌లో సోదాలు
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఇన్ కం ట్యాక్ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 12 March 2025 12:27 PM IST
శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ నజర్, మూడో రోజు హైదరాబాద్‌లో సోదాలు
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఇన్ కం ట్యాక్ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థల అధినేత బొప్పన సత్యనారాయణ రావు సహా ఇద్దరు కూతుర్ల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. విద్యా సంస్థల డైరెక్టర్లు బొప్పన సుష్మ, బొప్పన సీమ ఇళల్ల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ 10లలో ఉన్న సుష్మ, సీమ నివాసాల్లోనూ సోదాలు కొనసాగించారు. అయితే సోదాల సమయంలో ఇద్దరు డైరెక్టర్లు అందుబాటులో లేరని సమాచారం. ఇద్దరు వచ్చిన అనంతరం మరోసారి వారి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సోదాల్లో భాగంగా డైరెక్టర్ల నివాసాల్లో ట్యాక్స్ ఎగ్గొట్టిన డబ్బును ఎక్కడికి తరలించారనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. విద్యార్థుల నుంచి భారీగా నగదు తీసుకోవడం, అవే నగదును టాక్స్ చెల్లించకుండా మళ్లీ అంగీకరించుకోవడం వంటి అక్రమ లావాదేవీలను శ్రీ చైతన్య సంస్థలు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సోదాలు చేపట్టిన ఐటీ శాఖ అధికారులు ఈ వివాదంలో ఉన్న పన్ను చెల్లింపుల్ని, వ్యవహారాల్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలోనూ ఐటీ శాఖ బృందాలు శ్రీ చైతన్య కాలేజీలపై సోదాలు చేపట్టాయి. ఈ సోదాలు మూడో కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున ఐటీ శాఖ సోదాలు చేస్తోంది.