కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 5:02 AM GMTకాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రెండ్రోజులుగా తెలంగాణలోని పలువురి నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ తనిఖీ చేస్తోంది. నిన్నటి నుంచి తెలంగాణలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జానారెడ్డి మరో తనయుడు జయవీర్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. నాగార్జునసాగర్ నుండి జయవీర్ బరిలో నిలిచారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి రఘువీర్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్ పేట పారిజాత లక్ష్మినరసింహరెడ్డి నివాసంలో సోదాలు చేశారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చిన సమయంలో పారిజాత ఇంట్లో లేరు. తిరుపతి నుండి చెన్నై మీదుగా పారిజాతను ఐటీ అధికారులు నిన్న రాత్రి హైద్రాబాద్ కు తీసుకువచ్చారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల వరకు ఐటీ సోదాలు నిర్వహించారు. పారిజాత హైద్రాబాద్ కు వచ్చే సమయానికే ఆమె భర్త నరసింహరెడ్డి కూడ న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. పారిజాత నరసింహరెడ్డికి సంబంధించి ఆదాయం, వ్యాపార వ్యవహరాల గురించి ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా పారిజాత నరసింహరెడ్డి మీడియాకు చెప్పారు. పారిజాత నరసింహరెడ్డి, కెఎల్ఆర్ నివాసాల్లో కీలక పత్రాలు, నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారని సమాచారం. ఈ విషయమై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఐటీ సోదాలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు సహకరించే ఉద్దేశంతోనే బీజేపీ ఐటీ సోదాలను చేపట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఐటీ సోదాలకు తాము భయపడబోమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా అన్నారు. మరోవైపు ఈ సోదాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.