బీఆర్ఎస్‌ నాయకుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

తెలంగాణలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నేతల ఇళ్లు, వారికి సంబంధించిన ఆఫీసుల్లో తనిఖీలు

By Srikanth Gundamalla  Published on  14 Jun 2023 1:04 PM IST
IT Rides, BRS Leaders, MLA ShekarReddy, MP PrabhakarReddy, Telangana

బీఆర్ఎస్‌ నాయకుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

తెలంగాణలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నేతల ఇళ్లు, వారికి సంబంధించిన ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏకకాలంలో సుమారు 60కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడులను ఎదుర్కొంటున్న వారిలో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారు. వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పన్ను ఎగవేతపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకుల నివాసాలు, రియల్‌ఎస్టేట్‌ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన , జేసీ బ్రదర్స్ మాల్‌లో సోదాలు చేస్తున్నారు. అలాగే మర్రి జనార్ధన్‌రెడ్డికి సంబంధించిన పలు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలపైనా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తీర్థ గ్రూప్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. బెంగళూరులో పలు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్‌ పూర్తి చేసింది. ఐటీ అధికారులు ఆయా సంస్థల లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అలాగే శేఖర్‌రెడ్డి మామ మోహన్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఒక్కసారిగా బీఆర్ఎస్‌ నేతలను టార్గెట్‌ చేయడంతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. కేంద్రమే ఈ పని చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు.

Next Story