ఐసోలేష‌న్ క‌ష్టాలు.. చెట్టుమీదొక‌రు.. బాత్రూమ్‌లో మ‌రొక‌రు

Isolation difficulties.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2021 5:16 AM GMT
ఐసోలేష‌న్ క‌ష్టాలు.. చెట్టుమీదొక‌రు.. బాత్రూమ్‌లో మ‌రొక‌రు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్వ‌ల్ప ల‌క్షణాలు ఉంటే.. హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ 14 రోజుల్లో కోలుకోవ‌చ్చు. ప‌రిస్థితి మ‌రీ విష‌మంగా ఉంటేనే.. ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. ఐసొలేషన్‌కు ఇంట్లో మరో గది లేకపోవడంతో ఓ వ్య‌క్తిని చెట్టునే ఆవాసంగా చేసుకొని తొమ్మిది రోజులుగా అక్కడే ఉంటుండ‌గా.. మ‌రో వ్య‌క్తి ఇంట్లోని బాత్రూంలోనే రోజులను నెట్టుకొస్తున్నారు. ఇది కాస్త క‌ష్టంగానే ఉన్న‌ప్ప‌టికి త‌మ వల్ల ఇంట్లోని వారు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి హైద‌రాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో త‌ర‌గ‌తులు లేక‌పోవ‌డంతో కొద్ది రోజులుగా గ్రామంలోనే ఉంటున్నాడు. ఇటీవ‌ల అనారోగ్యంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా వ‌చ్చింది. అత‌డితో క‌లిపి వారి కుటుంబంలో 5గురు ఒకే గ‌దిలో ఉంటున్నారు. దీంతో అత‌డు త‌న ఇంటి ముందు ఉన్న చెట్టును ఆవాసంగా చేసుకుని ఉంటున్నాడు.

వికారాబాద్‌ జిల్లా మైలాపూర్‌ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దాదాపు అత‌డి ప‌రిస్థితి కూడా అంతే. ఇంట్లో క్వారంటైన్ కు వ‌స‌తి లేక‌పోవ‌డంతో బాత్రూంలోనే ఉంటున్నాడు. తన ప‌రిస్థితిని వివ‌రిస్తూ వీడియో తీసి గురువారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. వెంట‌నే స్పందించిన అధికారులు అత‌డిని అంబులెన్స్‌లో అనంత‌గిరి కొవిడ్ ఐసొలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు.


Next Story