బండి సంజయ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ: ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో చేస్తున్న పనులు అవే అంటున్న బీజేపీ సీనియర్ నేత
ఓట్లను కొనుగోలు చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ సొమ్మును వాడుతున్నారని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 10:02 AM ISTబండి సంజయ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ: ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో చేస్తున్న పనులు అవే అంటున్న బీజేపీ సీనియర్ నేత
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కార్పొరేటర్లు, ఓట్లను కొనుగోలు చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ సొమ్మును వినియోగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు.. కరీంనగర్‌కు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు సహాయంతో ఫోన్ ట్యాపింగ్ డబ్బు కరీంనగర్‌కు చేరుకుందని ఆరోపించారు బండి సంజయ్. కేవలం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, తెలంగాణలో ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బును ఉపయోగించారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండూ బీజేపీకి పోటీ కాదని, రెండో స్థానం కోసమే పోరాడుతున్నాయని బండి చెప్పారు. తన ఐదేళ్ల ఎంపీ పదవీ కాలంలో కరీంనగర్‌లో రూ.12 వేల కోట్ల నిధులు వెచ్చించామని బీజేపీ సీనియర్ నేత చెప్పారు.
న్యూస్ మీటర్: కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్‌లో ప్రచారం ఎలా సాగుతోంది?
బండి సంజయ్: మాకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మాకు అండగా నిలుస్తున్నారు. ఈ సారి ఎవరికి ఓటు వేయాలనే దానిపై ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి మళ్లీ ప్రధాని కావాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. మళ్లీ భారీ విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాను.
న్యూస్ మీటర్: పార్టీల వారీగా ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో, కాంగ్రెస్ నాలుగు గెలుచుకుంది, మిగిలిన మూడు BRSకి వెళ్లగా, BJP ఎక్కడా గెలవలేదు. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపుతుందా?
బండి సంజయ్: 2018 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఆరు నెలల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ దాదాపు 90 వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికలు కేవలం రాష్ట్రానికి సంబంధించినవి కావు.. కేంద్రం, దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. ప్రజల విషయానికొస్తే.. ఈ ఎన్నికలు నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇవ్వడానికి. కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో బీఆర్‌ఎస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేం గెలిచాం. ఇప్పుడు కూడా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. బీజేపీకి భారీ విజయాన్ని అందించడానికి ప్రజలు మళ్లీ మాకు మద్దతు ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాం.
న్యూస్ మీటర్: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావుతో బండి సంజయ్ పోటీ పడుతున్నారు. మీ అభిప్రాయం ప్రకారం బీజేపీకి ఎవరు గట్టి సవాల్ విసురుతున్నారు?
బండి సంజయ్: నా ప్రత్యర్థులిద్దరూ కేవలం రెండో స్థానం కోసం పోరాడుతున్నారు. కరీంనగర్‌లో బీజేపీ విజయాన్ని ఆపలేమని, అందుకే తమ మధ్య ద్విముఖ పోరు సాగుతున్నదని గ్రహించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరికి రెండో స్థానం దక్కుతుందో చూద్దాం.
న్యూస్ మీటర్: 2019 ఎన్నికల్లో బండి సంజయ్ తన సొంత ఇమేజ్‌పై గెలిచినట్లు కరీంనగర్ ప్రజల నుండి వచ్చిన అభిప్రాయం. అయితే, గత ఐదేళ్లలో కరీంనగర్ ప్రజలకు అందుబాటులో లేరని అభిప్రాయపడుతున్నారు. తమ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవడంపై స్థానిక నేతలు, కార్యకర్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రధానంగా ఈసారి ఎన్నికలలో గెలవడానికి మోదీ ఇమేజ్‌ను బయటకు తీసినట్లు టాక్ వినిపిస్తోంది. దీని గురించి మీరు ఏమి చెబుతారు?
బండి సంజయ్: నరేంద్ర మోదీ మా పార్టీ నాయకుడు, ఆయన మా అందరికీ స్ఫూర్తి. ఆయన ఇమేజ్ మీద ఎన్నికల యుద్ధం చేస్తే తప్పేంటి? ప్రజలు మూడోసారి మోదీకి మద్దతు ఇస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా నా పని గురించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్లు నష్టపోయినా.. తర్వాత మూడేళ్లలో దాదాపు రూ.12,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం ఎలా చేశానో ప్రజలు చూశారు. పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు.. వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. వారు నిస్వార్థంగా పనిచేశారు. ప్రజలు, దేశం కోసం నిర్భయంగా పోరాడారు. ఎన్నడూ అసమ్మతిని చూపించలేదు. నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజల హక్కుల కోసం నిలబడినందుకు నాతో సహా వారందరిపైనా పోలీసు కేసులు పెట్టారు. నేను ఏ యాత్ర చేపట్టినా, అది ప్రజాసంగ్రామ యాత్ర అయినా, ప్రజా హిత యాత్ర అయినా.. కరీంనగర్‌కు చెందిన క్యాడర్ నాకు మద్దతుగా ఎప్పుడూ ఉంటుంది. నా కేడర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.
న్యూస్ మీటర్: బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కొన్నింటిని చెప్పాలంటే, మీ ప్రత్యర్థులు కరీంనగర్, మల్కాజిగిరి సెగ్మెంట్లను ఉదాహరణగా చూపుతున్నారు. దాని గురించి మీరు ఏమి చెప్పాలి?
బండి సంజయ్: బీఆర్‌ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఓ అవగాహన ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కరీంనగర్ విషయానికి వస్తే జిల్లా నేతల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ కుమారుడికి, ఆయన కుటుంబానికి సన్నిహితుడు. ఎన్నికల్లో మూడో స్థానానికి దిగజారిపోతామన్న నమ్మకంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి తొలుత రంగంలోకి దిగేందుకు విముఖత చూపారు. అయితే, కేసీఆర్ ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టాడు. అందుకు తగ్గట్టుగానే బీఆర్‌ఎస్‌కు కనీసం రెండో స్థానం దక్కేలా కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా గులాబీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మంచి అవగాహనతో ఉన్నాయి. అందుకే ఇక్కడి పార్టీ క్యాడర్‌తో, ప్రజలతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది.
న్యూస్ మీటర్: ఇటీవల, ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. మీరు మీ ప్రచారంలో కరీంనగర్ ఎన్నికలలో దాని ప్రభావాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేస్తున్నారు. మరింత చెప్పగలరా?
బండి సంజయ్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు. కరీంనగర్ లో అశోక్ రావు అనే కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. అశోక్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ఆత్మీయ స్నేహితులు. కరీంనగర్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ సొమ్మును వినియోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఒక కార్పొరేటర్ లేదా నాయకుడిని కొనుగోలు చేసేందుకు రూ.20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఎన్నికల ఖర్చు కూడా చూసుకుంటున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ గెలిస్తే అది కూడా తమదేనన్న భావనలో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని వారు భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాకపోవడం మరో విశేషం. ఇంతకుముందు కూడా ప్రభాకర్ రావు మాకు చాలా ఇబ్బందులు సృష్టించారు. నా కదలికలపై నిరంతరం నిఘా ఉంచేవారు. నేను ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడల్లా నన్ను అరెస్టు చేయడానికి లేదా నా ఫోన్‌ను ట్యాప్ చేయడానికి నా ఇంటికి కొంత దూరంలో పోలీసు వాహనాన్ని ఉంచేవారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కు అవకాశం ఉందని నివేదికలు వెలువడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు సమకూర్చడానికి, కరీంనగర్‌లో ఫోన్ ట్యాపింగ్ డబ్బులు పంచారు.
లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే, సీఎం వేరే నాయకుడికి మొగ్గు చూపుతుండగా, మరొక శిబిరం మరొక నాయకుడికి మద్దతు ఇవ్వడంతో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ ఆమోదం పొందడంపై కూడా సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ టిక్కెట్టు చివరకు రాజేందర్‌రావుకే దక్కేలా చేసేందుకు ‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు’ ఫోన్ ట్యాపింగ్ సొమ్మును ఖర్చు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు కూడా అనుమానాలకు, సందేహాలకు దారితీస్తోంది.
న్యూస్ మీటర్: కరీంనగర్‌లో బండి సంజయ్ గెలిచి కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆయనకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తారనే చర్చ జరుగుతోంది. కరీంనగర్‌కు మేకోవర్ ఇచ్చేందుకు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా?
బండి సంజయ్: విద్యాసంస్థల ఏర్పాటు, ప్రజలకు మౌలిక వసతులు, సౌకర్యాలు మెరుగుపరచడం, అంతర్గత లింక్ రోడ్ల నిర్మాణం తదితరాలు నా జాబితాలో ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవిని దృష్టిలో పెట్టుకుని నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, విశ్వసనీయ కార్యకర్తలుగా మేము దానికి కట్టుబడి ఉంటాం. మోదీని మళ్లీ ప్రధానిని చేసి కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడమే మా లక్ష్యం. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన మొత్తం సీఆర్‌ఎఫ్ (కాలామిటీ రిలీఫ్ ఫండ్స్)లో ఒక్క కరీంనగర్‌లోనే 30 శాతం ఖర్చు చేయడం గమనించాలి.
న్యూస్ మీటర్: 2020- 2023 మధ్య రాష్ట్ర BJP అధ్యక్షుడిగా, మీరు అధికార BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసారు, చివరికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవిని కోల్పోయారు. ఇకపై తెలంగాణలో బీజేపీ పాత్ర ఎలా ఉంటుంది?
బండి సంజయ్: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా ప్రజల గొంతుకగా నిలిచినది బీజేపీ మాత్రమే. దీని కోసం మాపై లాఠీలు ప్రయోగించారు, కేసులు పెట్టారు, జైలుకు కూడా వెళ్లాము. అయితే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను నెరవేర్చాలన్న మాటపై కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పుడు మళ్లీ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోకు వ్యతిరేకంగా పోరాడాలి. ప్రతి మహిళ ఖాతాలో రూ.2500, ఆసరా పింఛన్ రూ.4వేలు, రైతుబంధు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు, నిరాశ్రయులైన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు, 10గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెరవేర్చని వాగ్దానాలపై, రాష్ట్ర ప్రజల తరపున పాలకులకు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాటం కొనసాగిస్తుంది.