International Widows Day: జీవచ్ఛవంగా బతుకుతున్న రేణుక.. తలరాత ఎలా మారిందంటే?
రేణుకకు 14 ఏళ్ల వయసులో వివాహమైంది. పేదరికం, వేధింపులు, నలుగురు పిల్లలు. ఇన్ని ఇబ్బందులు ఉన్న ఆమె కుటుంబాన్ని ఎలా నెగ్గుకురాగలదో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jun 2023 2:42 PM IST
International Widows Day: జీవచ్ఛవంగా బతుకుతున్న రేణుక.. తలరాత ఎలా మారిందంటే?
రేణుకకు 14 ఏళ్ల వయసులో వివాహమైంది. పేదరికం, వేధింపులు, నలుగురు పిల్లలు. ఇన్ని ఇబ్బందులు ఉన్న ఆమె కుటుంబాన్ని ఎలా నెగ్గుకురాగలదో అని అందరూ అనుకునేవారు. ఒక జీవచ్ఛవంగా ఆమె బతుకుతూ ఉండేది. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో, ఆమె మహిళా పొదుపు గ్రూపులో చేరింది. మద్యానికి బానిసైన భర్త పొదుపు సంఘం ద్వారా వచ్చిన డబ్బును స్వాహా చేయడంతో ఆమె అనుకున్నది ఏదీ జరగలేదు. ఇక భర్త మరణానంతరం, కాలుకు గాయం కావడంతో రేణుక పని చేయలేకపోయింది. ఆమె పెద్ద పిల్లలను జీవనోపాధి కోసం పంపించేది. వాళ్లు తీసుకుని వచ్చినవి.. కుటుంబం కోసం వాడుకునే వారు. రేణుక తన పిల్లలకు నివసించడానికి ఓ ఇల్లు, మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంది. వరంగల్‌కు చెందిన 'బాల వికాస' అనే స్వచ్ఛంద సంస్థ రేణుకకు అండగా నిలిచింది.
ఇక అహల్య అనే మహిళకి కూడా ఎన్నో కష్టాలు. 2005లో తన భర్త మరణించిన తర్వాత అహల్య కూడా సవాళ్లను, వివక్షను ఎదుర్కొంది. వివిధ కారణాల వలన నా స్వంత సోదరుడి వివాహానికి కూడా పిలవలేదు. కుటుంబ సభ్యుల కారణంగానే లైంగిక వేధింపుల బాధితురాలిగా మారింది. ఆ సమయంలో సామాజిక బహిష్కరణ కూడా ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకుంది.
భారతదేశంలో వితంతువులు తరచుగా సామాజిక బహిష్కరణలు ఎదుర్కొంటూ ఉంటారు. మూఢనమ్మకాల కారణంగా వారిని మరింత హింసిస్తూ ఉంటారు. అయితే బాల వికాస ఎంతో మంది వితంతువులకు అండగా నిలిచింది. వారి స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందేందుకు, సవాళ్ళను ఎదుర్కొనడానికి, గౌరవప్రదమైన జీవితాలను గడపడానికి తోడ్పాటును అందించింది. ప్రపంచమంతా అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పాటిస్తున్న వేళ, తమ భర్త మరణం తర్వాత రోజూ వివక్షని ఎదుర్కొంటున్న మహిళలకు బాల వికాస ఆశాజ్యోతిగా నిలుస్తోంది.
బాల వికాస యొక్క శిక్షణా కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్‌లు అనేక మంది వితంతువులు వారి బాధలను అధిగమించి తమ కాళ్ల మీద నిలబడడానికి కీలక పాత్ర పోషించాయి. “వితంతువులు బొట్లు, పువ్వులు, గాజులు వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. ఈ సామాజిక మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తోటి మహిళలతో కలిసి మేము పోరాడాము. నేను నా గుర్తింపును తిరిగి పొందాలని అనుకున్నాను.. నేను ఎప్పటిలాగే నాకు నచ్చినట్లు దుస్తులు ధరించడం మొదలు పెట్టాను. బాల వికాస అందించిన అధునాతన టైలరింగ్ శిక్షణ నాకు అవసరమైన నైపుణ్యాలను సాధించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా తీసుకువచ్చింది, నా కుటుంబానికి సహాయపడడానికి వీలు కల్పించింది, ”అని అహల్య చెప్పారు.
సాంఘిక కళంకంతో బాధపడుతున్న మరో వితంతువు మాధవి తన భర్త అకాల మరణం తర్వాత ఒంటరిగా ఉంది. కౌన్సెలింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ కారణంగా మాధవి టైలర్ గా మారింది, తన స్వంత కష్టం, సంపాదనతో జీవితాన్ని గడుపుతుంది. ఎంతో మందికి ఆమె ప్రేరణగా నిలిచింది.
బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి మాట్లాడుతూ, “15 సంవత్సరాలుగా, మేము సామాజిక వివక్షను సవాలు చేస్తూ ఈ విషయంలో పోరాడుతూ ఉన్నాము. మా లక్ష్యం స్పష్టంగా ఉంది.. వితంతువులలో వ్యక్తిగత స్థితిస్థాపకత, స్వయం ఉపాధిని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తాము, సమాజంలో వారికి తిరిగి స్వాతంత్ర్యం, గౌరవాన్ని తిరిగి పొందడంలో వారికి సహాయం చేస్తాము. మా కార్యక్రమాల ద్వారా వితంతువులకు కీలకమైన సహాయాన్ని అందిస్తాము. మేము వారిని పొదుపు చేయమని, సహాయక బృందాలను ఏర్పరచమని, వార్షిక ఆర్థిక సహాయం, కిరాణా సామాగ్రి, స్కాలర్‌షిప్‌లను అందిస్తూ ప్రోత్సహిస్తాము. మేము వితంతువులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను అర్థం చేసుకున్నాము. వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా పలు కార్యక్రమాలను చేపట్టాము" అని అన్నారు.
బాల వికాస కేవలం తక్షణ సహాయం అందించడమే కాకుండా వితంతువుల దీర్ఘకాలిక సాధికారత గురించి ఆలోచిస్తుంది. “మేము సైకలాజికల్ కౌన్సెలింగ్, నైపుణ్య శిక్షణను అందిస్తాము. వారి జీవితాలను పునర్నిర్మించడానికి, మెరుగైన భవిష్యత్తును కొనసాగించడానికి అవసరమైన సాధనాలతో వారికి సన్నద్ధం చేస్తాము. కానీ మా పని అక్కడితో ఆగదు. మేము గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వితంతువుల హక్కుల కోసం మా గళాన్ని ఉపయోగిస్తున్నాం. కాలం చెల్లిన ఆచారాలు, మూఢనమ్మకాలను సవాలు చేసే సామాజిక ఉద్యమాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, ప్రభావవంతమైన వ్యక్తులు, సంస్థల నుండి మద్దతు కోరుతున్నాము, ”అని సింగారెడ్డి చెప్పారు.