విషాదం..హాస్టల్‌లో ఉండలేక గోడదూకి పారిపోతుండగా కరెంట్‌షాక్

హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 6:40 AM IST
inter student, died ,  current shock, Hyderabad,

 విషాదం..హాస్టల్‌లో ఉండలేక గోడదూకి పారిపోతుండగా కరెంట్‌షాక్

హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక ఒక ఇంటర్ విద్యార్థి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతనికి విద్యుత్‌షాక్‌ కొట్టి చనిపోయాడు. అయితే.. ముందుగా కాలేజీ హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఒక రోజు తర్వాత ఆ విద్యార్థి మృతదేహాన్ని గోడ పక్కన గుర్తించారు.

తెనాలికి చెందిన ఎ.విజయ్‌ కుమార్‌ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్నాడ. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు గిరీశ్ కుమార్‌ (15) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బాలుడిని పది రోజుల కిందటే హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న కోహెడ వద్ద ఓ ప్రయివేట్‌ కాలేజ్‌ హాస్టల్‌లో చేర్పించాడు. కొడుకు బాగా చదువుకోవాలని తండ్రి కోరుకున్నాడు. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం కొడుకు గిరీశ్‌కు నచ్చలేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి చూశాడు. కానీ.. బుజ్జగించి.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము వస్తూనే ఉంటామని.. బాగా చదువుకోవాలని బతిమిలాడారు. దాంతో గిరీశ్‌ హాస్టల్‌ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి కాలేజీ నుంచి మెట్ల మార్గంలో బయటకు వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు గిరీశ్ కనిపించడం లేదని హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహారి గోడ దగ్గర గిరీశ్ మృతదేహాన్ని గుర్తించారు కాలేజీ సిబ్బంది. దాంతో.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. గిరీశ్‌ హాస్టల్‌ గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడనీ.. ఈ క్రమంలోనే ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తలకు తగిలి చనిపోయి ఉంటాడని గుర్తించారు. ఇక మరోవైపు యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనీ.. విద్యార్తి సంఘాలు ఆందోళనలు చేశాయి.

Next Story