భద్రాద్రి రాముడి సేవలో రాష్ట్రపతి.. ప్రసాద్ ప్రాజెక్ట్ ప్రారంభం
India President Murmu launched PRASAD scheme at Bhadrachalam. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పర్యటన కొనసాగుతోంది. శీతాకాల విడిది కోసం
By అంజి
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పర్యటన కొనసాగుతోంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ (ప్రసాద్) పథకం పనులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆమె విమానాశ్రయంలో దిగిన తర్వాత సారపాక బీపీఎల్ స్కూల్‌లోని హెలిప్యాడ్ వద్దకు ఐఏఎఫ్ చాపర్‌లో వచ్చారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ , మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ వినీత్ జి హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ముర్ము శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. పీఠాధిపతులకు పూజలు చేసి, అనంతరం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డితో కలిసి భద్రాచలం, పర్ణశాలలో 41.38 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ప్రసాద్ పథకం పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహబూబాబాద్, ఆసిఫాబాద్‌లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించిన ఆమె, వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జంజాతి పూజారి సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మొదటి మహిళా రాష్ట్రపతి ముర్ము.
అనంతరం ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్రపతికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్పలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భద్రకాళి ప్రధాన పూజారి శేషు ప్రత్యేక పూజలు నిర్వహించారు.