రామప్పకు భారత రాష్ట్రపతి ముర్ము.. షెడ్యూల్‌ ఇదే

India President Droupadi Murmu Will Visit Ramappa Temple. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన

By అంజి  Published on  15 Dec 2022 9:10 AM GMT
రామప్పకు భారత రాష్ట్రపతి ముర్ము.. షెడ్యూల్‌ ఇదే

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. డిసెంబర్‌ 26 నుంచి 30 తేదీల మధ్య ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 28వ తేదీన కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చారిత్రాత్మక శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.

పర్యటనలో భాగంగా మిశ్రా ధాతు నిగమ్ (మిధాని) కంచన్‌బాగ్‌లో విస్తృత-ప్లేట్ మిల్లు ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అలాగే రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

శీతకాల విడిదిలో భాగంగా ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌ నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ముర్మ బస చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుని, ఆ తర్వాత తెలంగాణ పర్యటనకు బయలుదేరుతారు. అదే రోజు మధ్యాహ్నం బొల్లారంలో యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇచ్చే విందుకు హాజరు అవుతారు.

ఈనెల 27న నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని సందర్శించనున్నారు. ఆ తర్వాత సర్దార్‌ వల్లభాయ్‌ జాతీయ పోలీసు అకాడమీని సందర్శించి శిక్షణలో ఉన్న ఐపీఎస్‌ అధికారులతో సంభాషించనున్నారు. ఈ నెల 28వ తేదీన భద్రాచలం ఆలయం, రామప్ప ఆలయాన్ని దర్శిస్తారు. ఇక 29వ తేదీన షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ను రాష్ట్రపతి సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం శంషాబాద్‌లోని శ్రీరామా నుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30వ తేదీ రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్‌ను సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతి నిలయం చేరుకొని ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Next Story