ఇబ్రహీంపట్నంలో గెలుపెవరిది..? నియోజకవర్గ ప్రజల మాటేంటి..?
ఇబ్రహీంపట్నంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 Nov 2023 4:13 AM GMTఇబ్రహీంపట్నంలో గెలుపెవరిది..? నియోజకవర్గ ప్రజల మాటేంటి..?
ఇబ్రహీంపట్నంలో ముక్కోణపు పోరు కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే వార్ ఉండనుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఆయన ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే.. ఈ సారి కూడా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్యే వార్ నడుస్తోందని చెప్పాలి. అసలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారనే దానిపై న్యూస్‌మీటర్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం:
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం ఒకటి. ఈ నియోజకవర్గం భాగ్యనగరానికి చేరువలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్. ఇక్కడ మొత్తం 2,21,478 మంది ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా 1952 నుంచి 1983 వరకు 8 సార్లు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1957 నుంచి 1967 ఎన్నికల వరకు ఎంఎన్ లక్ష్మీ నర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి కూడా బలం ఎక్కువగానే ఉంది. 1989, 1994, 2004లో సీపీఐ ఇక్కడ విజయం సాధించింది. అలాగే టీడీపీ కూడా రెండు సార్లు గెలిచింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసే గెలిచారు. అయితే.. 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా మంచిరెడ్డి కిషన్‌రెడ్డే విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై స్వల్ప ఓట్ల మెజార్టీతోనే గెలిచారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి:
అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి టికెట్ అందుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. ఆయన ఇప్పటికే మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 2009 నుంచి వరుసగా ఆయనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అధికార పార్టీలో ఉండటంతో ఆయన ప్రభుత్వ పథకాలనే ఆయుధాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.
కాంగ్రెస్ నుంచి బరిలోకి మల్‌రెడ్డి రంగారెడ్డి:
ఇక మరోవైపు కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన మల్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. అప్పుడు హస్తం పార్టీ క్యామ మల్లేశ్‌ను బరిలోకి దింపింది. దాంతో.. 2018 ఎన్నికల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం ఆయన 376 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండోస్థానంలో నిలిచారు. అయితే.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బలంగా ఉన్న మల్‌రెడ్డికే టికెట్ కేటాయించింది. ఈసారి ఎలాగైనా గెలవాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఉన్నారు.
బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న నోముల దయానంద్‌గౌడ్:
మరోవైపు బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఈ టికెట్ కోసం అశోక్ కుమార్ గౌడ్ పోటీపడినా.. బీజేపీ అధిష్టానం నోముల దయానంద్ గౌడ్ కే టికెట్ కేటాయించింది. అయితే.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీకి కూడా పట్టు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో మరింత బలంగా కనిపిస్తోంది హస్తం పార్టీ. ఇక్కడ వీరికి ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. అంతేకాదు.. గతంలో నోముల దయానంద్ గౌడ్ భువనగిరి ఎంపీగా గెలిచారు. బీసీ ఓటర్లు ఎక్కువగానే ఉంటారు. బీసీని సీఎం చేస్తామన్న హామీతో వారినంతా తమవైపు మళ్లించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
సీపీఎం నుంచి బరిలోకి పగడాల యాదయ్య:
సీపీఎం పార్టీ ముందుగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని చెప్పినా.. కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత వెనక్కి తగ్గింది. తమను పట్టించుకోవడం లేదని.. అడిగిన స్థానాలను కేటాయించడం లేదంటూ ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో.. తాము బలంగా ఉన్న చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పగడాల యాదయ్య బరిలోకి దిగుతున్నారు. అయితే.. ఈయన సీపీఎం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. 2001-2006 వరకు జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అలాగే 2018లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీపీఎం అభ్యర్థిగా యాదయ్య పోటీ చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం నుంచి పగడాల యాదయ్య కూడా పోటీ చేస్తున్నా.. వారికి ఉన్న కామ్రేడ్ ఓట్లు మాత్రం పడతాయి. కానీ.. గెలిచే అవకాశాలు మెండుగా కనిపించడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపిస్తోంది. చివరి సారి జరిగిన ఎన్నికల్లో కూడా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎన్నిక అయ్యారు.
నియోజకవర్గ ప్రజల ఏమంటున్నారంటే..
భాగ్యనగరానికి చేరువగా ఉండటం.. ఔటర్ రింగ్‌రోడ్డు కూడా దగ్గరగా ఉండటంతో ''ఇక్కడ అభివృద్ధి బాగానే జరిగింది అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా రోడ్లు బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తమకు ఆసరగా పెన్షన్ ఇస్తోందని.. గతంలో ఇలా ఎవ్వరూ ఇవ్వలేందంటున్నారు. అందుకే మరోసారి ఇక్కడ కిషన్‌రెడ్డిని గెలిపించుకుని కేసీఆర్ సర్కార్‌ను తీసుకొస్తామని అంటున్నారు. ఇక కొందరు గొల్లకురుమలు గతంలో తమకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసిందని చెప్పారు. ఇప్పుడు మరోసారి కూడా ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు. కులవృత్తులను కాపాడుతోన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని అంటున్నారు''.
మరోవైపు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసేవారి సంఖ్య కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్‌కు బలం ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతోంది. స్థానికంగా ఉన్న నేతలు కాంగ్రెస్‌లో భారీగా చేరుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా మంచిరెడ్డిని గెలిచారని.. ఈసారి మరొకరికి అవకాశం ఇవ్వాలని ఇంకొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. భారీగా బీఆర్ఎస్‌లో ఉన్న అసమ్మతి నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 5వేల నుంచి 10వేల మంది కాంగ్రెస్‌లో చేరారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నియోజకవర్గానికి చెందిన యాదయ్య మాట్లాడుతూ 'కాంగ్రెస్‌కు నేను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నా. ఈసారి కూడా కాంగ్రెస్‌కే ఓటు వేస్తా. ప్రభుత్వం వచ్చినా రాకపోయినా.. నేను మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేస్తా. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటా. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌కు పూర్తి బలం ఉండేది. ఇప్పుడు ఆ వైభవం నియోజకవర్గంలో తిరిగి వస్తుంది. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి పేద ప్రజల కోసం చాలా పోరాటాలు చేశారు. అందుకే ఆయనకు సపోర్ట్ పెరుగుతోంది. గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం గెలవడం పక్కా' అని అన్నారు.
ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అని చెప్పాలి. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందని అర్థం అవుతోంది. గతంలోనే స్వల్ప మెజార్టీతో గెలిచారని.. ఈసారి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు కత్తిమీద సామే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చివరకు ప్రజలే అంతిమ తీర్పు ఇవ్వాలి కాబట్టి.. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.