ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేశానని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్స్ ను విడుదల చేశారు. ఈ విడుదల చేసిన వాట్సప్ చాట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని.. బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద దాడి చేస్తున్నారని అన్నారు. అదంతా ఫేక్ చాట్ అని అన్నారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయన్నారు. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. ఇప్పుడు సుఖేష్ ను పావుగా వాడుకుంటున్నారన్నారు కవిత. కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.