ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
ఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
హైదరాబాద్‌లో చెరువుల పనురుద్ధరణకు ఏర్పాటైన హైడ్రా కబ్జాలపై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సూరం చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ పట్ల హైడ్రా మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తోందని విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
ఎఫ్‌టీఎల్ పరిధిలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లోనే తొలగించాలని అనుకున్నామని అన్నారు. పేద ముస్లిం విద్యార్థినుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందని అన్నారు. కళాశాలలో ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీలో సుమారు 10 వేల మందికిపైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి కళాశాలలు సామాజికంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తున్నాయని, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయని అన్నారు. కానీ, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని ‘హైడ్రా’ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్‌గా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడు కట్టడాలను కూడా కూల్చివేశాం. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు రూ.1000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నాం. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాదీనపర్చుకున్నాం. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని, దానిపట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నాం..అని హైడ్రా పేర్కొంది.