హైడ్రా చట్టబద్దమైనదే: కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా హాట్‌ టాపిక్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2024 6:00 PM IST
హైడ్రా చట్టబద్దమైనదే: కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా హాట్‌ టాపిక్ అయ్యింది. అయితే.. ఇటీవల తెలంగాణ హైకోర్టు హైడ్రా గురించి పలు ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో స్పందించిన కమిషనర్ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చట్టబద్ధమైనదే అని చెప్పారు. అక్టోబర్‌ లోపు హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్‌ వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే హైడ్రాకు విశేష అధికారాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. హైడ్రా చట్టబద్దమైనదే అన్నారు. గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుందనీ.. నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

తెలంగాణలో చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ప్ర‌భుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను స‌వాల్ చేస్తూ నానక్‌రామ్‌గూడకు చెందిన లక్ష్మీ పిటిషన్‌ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ కాద‌ని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తార‌ని పిటిషనర్‌ ప్రశ్నించారు. హైడ్రా చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. ఈ మేరకు హైడ్రా వ్యవహారంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొన్ని నిర్మాణాలను కూల్చివేశారని మండిపడింది. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు కూల్చడం ఏంటని నిలదీసింది. జీవో 99పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను ప్రశ్నించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. . త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు కోర్టు వాయిదా వేసింది.

Next Story