Traffic Rules: రాంగ్‌రూట్‌లో వెళ్తే మూడేళ్లు జైలు

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 2:50 AM GMT
Hyderabad, wrong route case, jail,   three years ,

Traffic Rules: రాంగ్‌రూట్‌లో వెళ్తే మూడేళ్లు జైలు 

హైదరాబాద్‌ నగరంలో చాలా మంది వాహనదారులు యూటర్న్‌ కాస్త దూరంలో ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తాం లే అనుకుని రాంగ్‌ రూట్‌లో వాహనాన్ని నడుపుతారు. ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. ఇలా రాంగ్‌రూట్‌లో నడపడం వల్ల వారికే కాదు ఎదుటివారికి కూడా డేంజర్. అయితే.. ట్రాఫిక్‌ నిబంధనల్లో భాగంగా పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా రాంగ్‌ రూట్‌లో వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు..జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మొదటిసారి రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడితే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. చార్జ్‌షీట్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఒక్కరోజే 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ పట్టుపడ్డారు.

రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వల్ల వారికే కాదు.. ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదమే అని ట్రాఫిక్ జాయింట్‌ సీపీ జోయల్ డేవిస్ చెప్పారు. రాంగ్‌రూట్‌ ప్రయాణం చేయడం చాలా ప్రమాదమని చెప్పారు. జరిమానాలు విధించినా ఉల్లంఘనలు తగ్గడం లేదనీ.. అందుకే రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌కు పాల్పడి వారిపై సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుల్లో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని జోయల్ డేవిస్ చెప్పారు. ఇంతకుముందు రాంగ్‌రూట్‌లో వచ్చేవారిపై కేసులు పెట్టలేదన్నారు. మొదటిసారిగా గత నెలలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించారు. గత నెలలో కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టామని చెప్పారు. సీసీ కెమెరాల్లో కూడా రాంగ్‌రూట్‌లో వెళ్లేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీపీ జోయల్ డేవిస్ చెప్పారు. అందుకే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి..క్షేమంగా ఉండాలని సూచించారు.

Next Story