హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం
తెలంగాణలో మరోసారి వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం
తెలంగాణలో మరోసారి వర్షాలు పడుతున్నాయి. గత రెండ్రోజులుగా ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా శనివారం కూడా హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు భానుడు భగభగ మండిపోయాడు. కానీ.. సాయంత్రం 4 గంటలు దాటగానే మబ్బులు కమ్మేసుకున్నాయి. ఒక్కసారిగా నగర వ్యాప్తంగా ఆయా చోట్ల వర్షం పడింది. దాంతో.. ఒక్కసారిగా ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లు అయ్యింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బషీర్ బాగ్, పటాన్‌చెరు, మియాపూర్, చందానగర్, అబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, అల్వాల్, ఉప్పల్, మెహదీపట్నం, రాంనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైదర్‌నగర్, మేడ్చల్, అంబర్‌పేట్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఇళ్లలో ఉన్న ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం లభించినా.. బయట తిరుగుతున్న వారికి మాత్రం ట్రాఫిక్.. వరద వల్ల కాస్త ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.
మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లలో అయితే భారీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం pic.twitter.com/7yYi0uU28o
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 18, 2024