విద్యుత్‌శాఖ కీలక నిర్ణయం.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు నిరంతరం ఫ్యాన్లు.. కూలర్లు, ఏసీలను వినియిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 7 May 2024 10:22 AM ISTవిద్యుత్‌శాఖ కీలక నిర్ణయం.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 దాటిందంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎండ వేడిమి.. ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు నిరంతరం ఫ్యాన్లు.. కూలర్లు, ఏసీలను వినియిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం ఈ పరికరాలు నడుస్తూనే ఉన్నాయి.
కాగా.. మధ్యమధ్యలో ఆపుతూ.. మళ్లీ ఆన్ చేస్తుండటంతో కరెంటు వినియోగంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దాంతో.. విద్యుత్ శాఖ అధికారులకు గ్రిడ్‌ను నిర్వహించడం కష్టం అవుతోంది. ఓవర్‌లోడ్ కారణంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల రోజుకు మూడు నుంచి ఏడెనిమిది సార్లు పవర్ కట్స్ అవుతున్నాయి. దాంతో.. నగర ప్రజల నుంచి విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి. ఎందుకు పదేపదే పవర్ కట్ చేస్తున్నారంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు. ఫిర్యాదులు రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో డిస్కంకు ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే సరఫరా వ్యవస్థ మెరుగ్గా ఉన్నా.. ఈ ఓవర్ లోడ్ కారణంగా అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అగ్నిమాపక కమాండ్ సెంటర్ తరహాలోనే నిరంతర విద్యుత్ సరఫరా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ట్విట్టర్‌లో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఒక విభాగం పనిచేస్తుంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే.. వాటిని స్వీకరించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కరెంట్‌ను పునరుద్ధరిస్తున్నారు. వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాపై నిరంతర నిఘా ఉంచారు విద్యాశాఖ అధికారులు.