Hyderabad: అడ్డొచ్చినవారిని ఢీకొడుతూ పంజాగుట్టలో కారు బీభత్సం
జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరిచిపోకపోముందే నగరంలో మరో కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 8:45 AM ISTHyderabad: అడ్డొచ్చినవారిని ఢీకొడుతూ పంజాగుట్టలో కారు బీభత్సం
హైదరాబాద్‌లో తరచూ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరిచిపోకపోముందే నగరంలో మరో కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డువచ్చిన వారిని ఢీకొడుతూ హంగామా చేశాడు. అయితే.. స్థానికులు ఆగ్రహంతో స్పందించారు. కారును అడ్డుకున్నారు. మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. జరిమానాలు విధిస్తారని చెప్పినా.. చట్టాలు తమ చుట్టాలు అన్నట్లుగా వ్యవహిరిస్తున్నారు. పంజాగుట్టలో ఓ వ్యక్తి మద్యం సేవించాడు. ఆ తర్వాత కారు ఎక్కి స్టీరింగ్ తిప్పాడు. అడ్డువచ్చిన వారిని ఢీకొడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అక్కడున్న స్థానికులంతా అరుస్తూ కారు వెంటపెడ్డారు. అయితే.. కారు ఎక్కువ వేగంతో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కారును వెంబడించిన స్థానికులు ఆపి.. సుదరు కారు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కాగా.. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి కారు ముందు భాగంపై పడిపోయినా అలాగే ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి దగ్గర హిట్‌రన్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.