సన్‌బర్న్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్.. చీటింగ్ కేసు నమోదు
న్యూయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 5:06 PM ISThyderabad new year sunburn event case booked
న్యూయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు కొందరు న్యూఇయర్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్ 31న 2023కు గుడ్‌బై చెప్పి.. 2024కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో నగరంలో సన్‌బర్న్ పేరుతో నిర్వహిస్తోన్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకను మాదాపూర్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. ఏకంగా దీంట్లో ఎంట్రీ కోసం బుక్‌మై షో ద్వారా టికెట్లు విక్రయాలను మొదలుపెట్టారు. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులతో పాటు.. సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు.
ఆదివారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సన్‌బర్న్ ఈవెంట్‌పై చర్చ జరిగింది. ఈ ఈవెంట్‌కు ఎవరు అనుమతి ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని అడిగారు. రాష్ట్రంలో న్యూఇయర్ సందర్భంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎక్కడా డ్రగ్స్ అనే మాటే వినపడొద్దని పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
దీంతో వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలు నిర్వహించే వారు ఎవరైనా సరే అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. సన్‌బర్న్ ఈవెంట్‌కు సంబంధించి అనుమతి లేకుండా టికెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్‌మై షోతో పాటు.. సన్‌బర్న్ షో నిర్వాహలకుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్‌బర్న్ ఈవెంట్‌పై స్పందించిన సీపీ అవినాశ్ మహంతి.. ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్ లాంటి వేడుక కాదన్నారు. అందుకే ఈ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించామని వెల్లడించారు.