ఉత్కంఠకు బ్రేక్.. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య నియామకం
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమించారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 5:11 PM ISTఉత్కంఠకు బ్రేక్.. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య నియామకం
తెలంగాణలో ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచనతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్యానల్ నుంచి అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను మాత్రం కాస్త ఆలస్యంగా ప్రకటించారు అధికారులు.
ఎన్నికల వేళ హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దాంతో.. హైదరాబాద్ తదుపరి పోలీస్ కమిషనర్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముందు జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలతో పాటు ఇద్దరు సీపీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సీపీని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అయితే.. కాసేపటికే హైదరాబాద్ సీపీని నియమిస్తూ ఉతర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం రోజు హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. సందీప్ శాండిల్యా ప్రస్తుతం పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వే అడిషనల్ డీజీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గానూ పని చేశారు.
అయితే.. ఎన్నికల సంఘం సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీ రేసులో ముగ్గురి పేర్లు వినిపించాయి. సందీప్ శాండిల్యతో పాటు శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు కానీ.. ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.