Hyderabad: ఎన్నికల వేళ ఆరు కార్లలో రూ.6.5 కోట్లు పట్టివేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 4:59 PM IST
Hyderabad: ఎన్నికల వేళ ఆరు కార్లలో రూ.6.5 కోట్లు పట్టివేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు.. అక్రమంగా డబ్బులు, ఇతర వస్తువులను తరలిస్తున్న వారిపై ఎన్నికల అధికారులు, పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అధికార ప్రతినిధులు అయినా సరే వాహనాలను ఆపి చెక్ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అక్కడక్కడ భారీగా నగదుతో పాటు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోనూ భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని అప్పా జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అటుగా వెళ్తున్న కార్లను ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. దాంతో.. మొత్తం ఆరు కార్లలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. పూర్తిగా కార్లను చెక్ చేయగా డబ్బుని చూసి పోలీసులే షాక్ అయ్యారు. సూట్‌కేసుల నిండా డబ్బులు పెట్టుకుని తరలిస్తున్నారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాలోని ఓ నేతకు సంబంధించిన నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ తనిఖీల్లో ఆరు కార్లలో మొత్తం రూ.6.5 కోట్ల నగదుని పట్టుకున్నారు. నగదుకి సంబంధించిన వివరాలు, సంబంధిత పత్రాలు చూపకపోవడంతో డబ్బు మొత్తాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
ఎన్నికల వేళ హైదరాబాద్ నగర శివారు అప్పా జంక్షన్ వద్ద భారీగా నగదు పట్టుకున్న పోలీసులుఆరు కార్లలో తరలిస్తున్న రూ.6.5 కోట్లు సీజ్ చేసిన పోలీసులు pic.twitter.com/QYgAk7KaLO
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 18, 2023