మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

మూసి ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2024 3:15 PM GMT
మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: మూసి ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పనుల వల్ల ఏ కుటుంబం అయినా నష్టపోతే.. తాము ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలు చెందొద్దని చెప్పారు.హైదరాబాద్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మూసి నది తీరాన్ని టూరిజం హబ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం చంచల్ గూడ వద్ద 288 డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో లబ్దిదారులకు ఇంకా పంపిణీ చేయాల్సిన ఖాళీగా ఉన్న 2BHK గృహ సముదాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్దేశించిన ప్రకారం గృహాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఖాళీగా గృహాలను మూసి బాధితులకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. చంచల్ గూడ ఎక్స్ రోడ్ లో 288గృహాలు నిర్మించారని, అందులో 142 మందికి పంపిణీ చేశామన్నారు. మిగతా 146 ఖాళీగా ఉన్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. మూసి నది బాధితులకు న్యాయం చేస్తామని, ఎవ్వరూ కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. హైదరాబాద్ నగరం సాంస్కృతికంగా పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. మరి కొందరు నిరుపేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలని అడుగుతున్నారని, వారికి కూడా న్యాయం చేస్తామన్నారు.

Next Story