నాగోల్ మెట్రోను సందర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్
నాగోల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 7:03 AM ISTనాగోల్ మెట్రోను సందర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్
హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో నిత్యం ఎంతో మంది ప్రయాణికులు వెళ్తుంటారు. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. అయితే.. ఈ ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెట్రోరైలు ఆపరేషన్స్‌కు నాగోల్‌లోని ఓసీసీ గురించి రజనీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన మెట్రో రైలు ఓసీసీని సందర్శించారు. నాగోల్‌కు వచ్చి అక్కడి మెట్రో సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించిన పరిస్థితులను చూశారు. మెట్రో రైలు అధికారులను సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మెట్రో రైలు ఓసీసీని సందర్శించడంపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. తమకు నిజంగా చారిత్రాత్మక సందర్భం అని తెలిపింది. ఈ క్షణం L&TMRHLకి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొంది. ఇది మా సంస్థ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ప్రముఖుల సందర్శన అనీ.. ఇది నిస్సందేహంగా రాబోయే సంవత్సరాల్లో మన సామూహిక జ్ఞాపకంలో నిలిచిపోయే మైలురాయి అంటూ హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది.