Hyderabad: ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తూ..బస్సు కిందపడి విద్యార్థిని మృతి

ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

By Srikanth Gundamalla
Published on : 14 Jun 2024 3:59 PM IST

hyderabad, inter girl student, died,  bus ,

 Hyderabad: ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తూ..బస్సు కిందపడి విద్యార్థిని మృతి

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించిన తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. చాలా వరకు బస్సులన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. అయితే.. పలు రూట్లలో సరిపోయే అన్ని బస్సులు లేకపోవడమే కారణమని జనాలు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఫుట్‌బోర్డులో నిలబడి ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. ఫుట్‌బోర్డులో నిలబడి వెళ్తుండగా కాలుజారి కిందపడిపోయింది. దాంతో.. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో రద్దీ ఎక్కువగా ఉంది. అందులో ఫుట్‌బోర్డులో ఎక్కి ప్రయాణం చేస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కాలు జారి కింద పడింది. దాంతో.. ఆమె బస్సు కిందకు వెళ్లిపోయింది. బస్సు చక్రాలు ఆమె మీద నుంచి వెళ్లిపోయాయి. ఈ సంఘటన దృశ్యాలు అక్కడే రోడ్డు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ప్రమాదాన్ని చూసి అయ్యో అంటున్నారు. కాగా మృతులాలు యూసుఫ్‌గూడలో ఉన్న మాస్టర్స్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్న మెహరీన్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story