హైడ్రా దూకుడు.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికీ నోటీసులు
హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 10:31 AM ISTహైడ్రా దూకుడు.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికీ నోటీసులు
హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో చాలా చోట్ల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. చెరువు కబ్జాలు, భూముల ఆక్రమణను సీరియస్‌గా తీసుకుని ఈ చర్యలు తీసుకుంటోంది. తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటోన్న నివాసానికి నోటీసులు అంటించారు. మదాపూర్‌లోని కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటోన్న ఇల్లు, కార్యాలయానికి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు 30 రోజుల గడువు ఇచ్చారు.
ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కట్టడాలను తమంతటతాముగా తొలగించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో.. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరీహిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ చేశారు. ఆ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చారు అధికారులు. FTLను అక్రమించిన కట్టిన అక్రమ నిర్మణాలను స్వచ్ఛందంగా కూల్చియాలని ఆయా నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక్క రోజులోనే నాలుగు కాలనీల్లో వందల ఇళ్లు.. వివిధ కార్యాలయాలకు నోటీసులు అంటించారు. ఇక నోటీసుల్లో పేర్కొన్న విధంగా స్వచ్ఛందంగా నిర్మాణాలను కూల్చివేయకపోతే తాము కూల్చివేతలు చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ నోటీసులు చాలా ఇళ్లకు అంటించడంతో స్థానికంగా ఉన్న జనాల్లో కలకలం రేపింది.