గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 2:27 PM IST
Hyderabad, gunpark, high tension, tpcc chief, revanth reddy  ,

గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లడానికి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని.. అందుకే అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పారు. రేవంత్‌రెడ్డి పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట మొదలు అయ్యింది. దాంతో ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్‌రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో పరిణామాలు మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్‌ దక్కిన అభ్యర్థులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఆయా పార్టీల నుంచి టికెట్‌ ఆశించి దక్కని వారు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఇక ముఖ్య నేతలంతా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పర్యటనలు చేస్తున్నారు. దాంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన చాలెంజ్‌ను స్వీకరిస్తే అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని పిలిచారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ప్రమాణం చేసేందుకు అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు.

పలువురు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి రేవంత్‌రెడ్డి గన్‌ పార్క్‌ వద్దకు చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. అమరవీరుల స్థూపం వద్దకు మీకు అనుమతి లేదంటూ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్నారు. దాంతో.. రేవంత్‌రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఆ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో రేవంత్‌రెడ్డి పోలీసుల వ్యాన్ ఎక్కి మరీ నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల వాహనాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

Next Story