విద్యుదాఘాతంతో చనిపోయిన భర్త.. భార్యకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ రూ.7 లక్షలు చెల్లించాల్సిందే

విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి జీవిత భాగస్వామికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ TSNPDCLని ఆదేశించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sep 2024 9:15 AM GMT
District Consumer Disputes Redressal Commission, Adilabad, water heater ,TSNPDCL

విద్యుదాఘాతంతో చనిపోయిన భర్త.. భార్యకు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ రూ.7 లక్షలు చెల్లించాల్సిందే

విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి జీవిత భాగస్వామికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSNPDCL)ని ఆదేశించింది. వ్యాజ్యానికి అయిన ఖర్చులకు సంబంధించి రూ.2,000 మొత్తాన్ని కూడా చెల్లించాలని ఆదేశించింది.

కేసు వివరాలు

25 ఏళ్ల మహమ్మద్ ముర్తుజా అహ్మద్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 8, 2020న మరణించాడు. ముర్తుజా అహ్మద్ స్నానం చేయడానికి వాటర్ హీటర్‌ను బకెట్‌లో ఉంచాడు. బకెట్‌లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

అతని భాగస్వామి కహెకషన్‌ ముర్తుజా అహ్మద్‌ తన సోదరుడికి చెప్పడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ముర్తుజా అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని వన్‌టౌన్‌ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశారు. ముర్తుజా అహ్మద్ సోదరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ముర్తుజా అహ్మద్ విద్యుదాఘాతం కారణంగా మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కరెంటు వైర్లు, విద్యుత్ సరఫరా సక్రమంగా నిర్వహించని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని, సర్వీస్‌లో లోపానికి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ తనకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని మృతుడి భార్య కహెకషన్ ఆరోపించారు. న్యాయం కోరుతూ కహెకషన్ కమిషన్ తలుపులు తట్టారు.

సేవలో లోపాలు లేవని చెప్పిన TSNPDCL

ఈ ఘటనకు సంబంధించి TSNPDCL తన కౌంటర్ దాఖలు చేసింది. సేవలో ఎటువంటి లోపం లేనందున ఫిర్యాదు కరెక్ట్ కాదని వాదించారు. ముర్తుజా అహ్మద్ తన ఇంట్లో బకెట్‌లో నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్‌ను ఉపయోగిస్తున్నారని TSNPDCL తెలిపింది. ఇంటి వైరింగ్, ప్లగ్, నాసిరకం వాటర్ హీటర్, వాటర్ హీటర్ పాడైన వైర్ మొదలైనవాటిలో లోపం కారణంగా విద్యుదాఘాతానికి గురై మరణించాడని TSNPDCL చేసిన వాదన గురించి కమిషన్ పట్టించుకోలేదు. కరెంట్ లైన్లు, ఇతర విషయాలలో ఉద్యోగుల నిర్లక్ష్యం కూడా లేదని TSNPDCL తెలిపింది. ముర్తుజా అహ్మద్ తల్లి రయిస్ సుల్తానా తన కొడుకు విద్యుదాఘాతానికి గురై మరణించినందుకు ఎక్స్ గ్రేషియా మొత్తం కోసం చేసిన విజ్ఞప్తి మేరకు, TSNPDCL మే 27, 2022న రూ. 4.5 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచి, రూ. 50,000 నగదును చెల్లించింది. భవిష్యత్తులో రయిస్ సుల్తానా లేదా మరణించిన వారి ఇతర చట్టపరమైన వారసులు ఎటువంటి క్లెయిమ్ చేయమని అంగీకరించారు. అయితే ముర్తుజా భార్య తన భర్త చావుకు TSNPDCL లోపం ఉందంటూ కమీషన్ ను ఆశ్రయించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న కమిషన్, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, వాటర్ హీటర్ వైర్, హౌస్ వైరింగ్, ఎర్తింగ్, స్విచ్‌బోర్డ్ తదితరాలను మంచి స్థితిలో ఉంచకుండా ముర్తుజా అహ్మద్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చూపించడానికి టిఎస్‌ఎన్‌పిడిసిఎల్ ఎటువంటి సాక్ష్యాలను దాఖలు చేయలేదని పేర్కొంది. కహెకషన్ ముర్తుజా తన భర్త సంపాదనపై ఆధారపడి ఉంది. ముర్తుజా అహ్మద్ ఆకస్మిక, అకాల మరణం కారణంగా ఆమె చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది. కహెకషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కమిషన్ ఆమెకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ని ఆదేశించింది.

Next Story