వైకుంఠ ఏకాదశి.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Huge Rush Of Devotees In Temples On Vaikunta Ekadashi. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని
By అంజి Published on 2 Jan 2023 2:41 AM GMTతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, అన్నవరం, విజయవాడ, ధర్మపురి యాదాద్రి, ద్వారకా తిరుమల, అనంతపురం, మంగళగిరి, భద్రాచలం తదితర ఆలయాలు భక్త జనసంద్రంగా మారాయి. తిరుమలలో అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు దర్శనాలను ప్రారంభించారు.
తిరుమలలో ముందుగా ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్ పొందిన భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాలు కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్, మహారాష్ట్ర సీఎం, ఏపీ మంత్రులు రోజా, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి, ఉషశ్రీ, నారాయణ స్వామి, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
భద్రాచలం ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు శ్రీరాముని దర్శనం కల్పిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ తల్లి కొలువుదీరారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో అధికారులు ఆలయంలో నిత్యకల్యాణాలను నిలిపివేశారు. సింహాచలంలో కూడా స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున తొలి పూజల అనంతరం స్వామివారు ఉత్తరద్వార దర్శనమిస్తున్నారు.
సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశికి పిలిచే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. బ్రహ్మ ముహూర్తకాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం కావడంతో దీనికి 'ముక్కోటి ఏకాదశి' అని పేరు.