కడెం ప్రాజెక్టులో ప్రమాద స్థాయికి చేరిన నీటిమట్టం.. వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా
Huge Floods to Kadem Project.తెలంగాణలో బారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుంభవృష్టి కురవడంతో వాగులు
By తోట వంశీ కుమార్ Published on 13 July 2022 5:02 AM GMTతెలంగాణలో బారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు,
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా 5లక్షల క్యూసెక్యుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్యుల నీటిని బయటకి వదులుతున్నారు. అయినప్పటికీ అవుట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్యులు అధికంగా ఉండడంతో ప్రాజెక్టు కట్ట పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మొత్తం 18 గేట్లు ఉండగా.. ఒకటి మొరాయిండంతో 17 గేట్లను పూర్తి స్థాయిలో తెరిచారు. అయినప్పటికీ వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వరద ఉధృతి అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ముష్షరఫ్ ఇతర అధికారులు రాత్రంతా ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితిని సమీక్షించారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్యాం దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా
విషయం తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ వరద ఉదృతిపై ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్‌చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ముంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని తెలిపారు.