తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. తిరుమాఢ వీధులు భక్తులతో నిండిపోయింది. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి ఆలయం పునర్ వైభవం తరువాత అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయంలో బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులతో పాటు తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురంతో పాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణ శిలలతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో నిలువెత్తు ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భాగ్య నగరానికి సమీపంలోనే ఉండడంతో వారాంతంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది.