పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి: అమిత్‌షా

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  17 Sept 2023 11:23 AM IST
Home Minister, Amit shah, telangana, liberation day,

పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి: అమిత్‌షా

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తొలుత హోంమంత్రి అమిత్‌షా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత భద్రతా బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. హైదరాబాద్‌ విముక్తి కోసం అమరులైన వీరులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు అమిత్‌షా.

తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగిందని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేసుకున్నారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకి నివాళులు అర్పిస్తున్నట్లు అమిత్‌షా తెలిపారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 'ఆపరేషన్‌ పోలో' పేరుతో నిజాం మెడలు వంచారని చెప్పారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారని పటేల్‌ను అమిత్‌షా పొగిడారు. పటేల్‌ లేకపోయి ఉంటే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని అమిత్‌షా అన్నారు. అయితే.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై అమిత్‌షా ఎలాంటి విమర్శలు చేయకుండానే ప్రసంగాన్ని ముగించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అందరూ భావించినా.. అందుకు భిన్నంగా సాగింది అమిత్‌షా ప్రసంగం. కాగా.. చివరకు పలువురు దివ్యాంగులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌సా ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.

Next Story