Hyderabad: చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ మృతి

ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2023 8:55 AM IST
Home Gaurd, Ravinder, Death, hospital, Hyderabad,

Hyderabad: చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ మృతి

ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ కన్నుమూశాడు. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ ప్రాణాలు కోల్పోయాడు. రవీందర్‌ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతడి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. దాంతో మనస్థాపం చెందిన హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల ఎదుటే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన అధికారులు రవీందర్‌ను ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన రవీందర్‌ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. రవీందర్‌ మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

ప్రభుత్వం జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం అయ్యిందని రవీందర్‌ మనస్తాపానికి గురయ్యాడు. హోంగార్డు అధికారుల ఎదుటే రవీందర్‌ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన అధికారులు రవీందర్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 75 శాతం కాలిన గాయాలు కావడంతో.. అతడికి డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌ ఆత్మహత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దాంతో.. ఈ ఘటనపై జేసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సకాలంలో హోంగార్డులకు జీతాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇక రవీందర్‌ చికిత్స పొందుతున్న సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పరామర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడవొద్దని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. రాష్ట్ర బీజేపీ కూడా హోంగార్డులకు అండగా ఉంటుందని చెప్పారు కిషన్‌రెడ్డి.

ఇక చికిత్స పొందుతున్న రవీందర్ ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు రవీందర్‌ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.

Next Story