తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. హోలీ పండగ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహించడంపై నిషేదం విధించారు.
పరిచయం లేని వారిపై రంగులు చల్లరాదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని తెలిపారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
అలాగే మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్‌లు మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో మందుబాబులు మద్యం దుకాణాలు మందు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి.