ఓఆర్ఆర్ టెండర్లలో భారీ కుంభకోణం జరుగుతోందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధామైనవని ఆయనకు లీగల్ నోటీసులు పంపింది హెచ్‌ఎండీఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ బిడ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్‌లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది HMDA. రేవంత్‌రెడ్డి చేసిన అసత్య ఆరోపణల వల్ల..సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని హెచ్‌ఎండీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు అందుకున్నాక, 48 గంటల్లోగా బహిరంగంగా, బేషరతు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది హెచ్‌ఎండీఏ. లేదంటే, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ హెచ్చరించింది.
లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్‌రోడ్డును రూ.7వేల కోట్లకు అమ్మేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్‌ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని విమర్శించారు. ఓఆర్‌ఆర్ టోల్ స్కామ్‌పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. 30 రోజుల నిబంధనపై అర్వింద్ కుమార్ ఏం చెబుతారని ప్రశ్నించారు. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చారా ఆ సమాచారం ఏది? 30 రోజుల్లో 25శాతం చెల్లించాలని ఒప్పందంలో ఉంది. ఇప్పటికీ ఐఆర్‌బీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.