తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ హిమా కోహ్లీ
Hima Kohli to take oath as Chief Justice. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ.
By Medi Samrat Published on 7 Jan 2021 12:46 PM IST
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. జస్టిస్ హిమా కోహ్లీ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార ముగిసిన అనంతరం జస్టిస్ హిమా కోహ్లీకి.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ హిమ కోహ్లీ.. తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో పుట్టిన జస్టిస్ హిమ కోహ్లీ.. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి 1979లో బీఏ ఆనర్స్ హిస్టరీలో పట్టభద్రులయ్యారు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
అనంతరం ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1984లో సభ్యురాలిగా నమోదై న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 15 నెలల తరువాత పూర్తిస్థాయి జడ్జిగా అక్కడే బాధ్యతలు స్వీకరించారు. ఆపై సుప్రీంకోర్టు.. కొవిడ్-19 విస్తరణ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీకి హిమ కోహ్లీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.