తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు న్యాయవాదుల హత్య ఉదంతం సంచలనం రేపింది. రాష్ట్రంలో అసలు న్యాయ వ్యవస్థ ఉందా లేదా అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి మృతదేహాలకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఆసుపత్రి ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుల కుటుంబసభ్యలను పరామర్శించారు. వామన్‌రావు దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు.
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. పట్టపగలే దుండగులు న్యాయవాదులపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన ఘటనకు నిరసనగా.. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
నాంపల్లి సిటీ సివిల్ కోర్టు నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీగా వెళ్తున్న అడ్వకేట్లను సైఫాబాద్ పీఎస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో న్యాయవాదులను బలవంతంగా అరెస్ట్ చేశారు. జంట హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.