ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం
తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
By - అంజి |
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం
తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేవలం పామాయిల్‌తోనే కాకుండా దానిలో పసుపు, అల్లం, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో, మిరియాలు వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందొచ్చు. ఈ పంట సాగుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఆయిల్ పామ్ మొక్క రూ.200 కాగా.. ప్రభుత్వం రూ.180 సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఎకరాకు 50 మొక్కలకు చొప్పున సబ్సిడీ అందుతుంది. అలాగే ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతుల అకౌంట్లలో ప్రభుత్వం సాయాన్ని జమ చేస్తోంది. దీనికి 10 ఎకరాలను సీలింగ్‌గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100 శాతం సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు (2.47 ఎకరాలు)కు దిగుమతి రకం మొక్కలకు రూ.29 వేలు, స్వదేశీ మొక్కలకు రూ.20 వేలు ఇస్తోంది. బోర్‌వెల్‌కు రూ.25 వేలు, మోటారుకు రూ.10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్ ఏర్పాటుకు రూ.20 వేలు, పంట కోత సమయంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూ.2500 అందిస్తోంది.
ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. కోకో, కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస, మొక్కజొన్న వంటి అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.