ఎయిర్ అంబులెన్స్‌కు గిరాకీ.. గంటకు ఎంతంటే..?
High demand for air ambulances. రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌ల వినియోగం పెరుగుతుంది. ఆక్సిజన్, వెంటిలేటర్, సౌకర్యాలు ఉండడంతో ఈ సేవలను ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 23 May 2021 6:40 AM GMTకరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఈ మహమ్మారి సోకిన వారి పరిస్థితి ఎప్పుడు విషమంగా మారుతుందో చెప్పలేం. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల వల్ల క్షణాల్లో వారి ఆరోగ్య పరిస్థితులు మారిపోతున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌ల వినియోగం పెరుగుతుంది. గతంలో అయితే.. కొండల్లో, కోనల్లో ప్రమాదాల్లో గాయపడిన వారిని తరలించడానికి ఎయిర్ అంబులెన్సులు ఉపయోగించేవారు. అయితే.. ప్రస్తుతం కరోనా కారణంగా వీటి వినియోగం పెరుగుతోంది.
ఇందులో ఆక్సిజన్, వెంటిలేటర్, సౌకర్యాలు ఉండడంతో ఈ సేవలను ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. అయితే.. దీనికి గంటకు రూ.1.5లక్షలు వరకు వసూలు చేస్తుండడంతో ప్రజలపై అధిక భారం పడుతోంది. ఇటీవల బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ సాయంతో ఓ యువతిని, మరో వ్యక్తిని ఎయిర్ అంబులెన్స్ ద్వారానే నగరానికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం కొవిడ్ సోకిన 54 ఏళ్ల వ్యక్తిని సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్సు ద్వారా తరలించారు. ప్రస్తుతం ప్రతి నెలా 5 మంది రోగులను నగరానికి తీసుకొస్తున్నట్లు ఓ ఎయిర్ అంబులెన్స్ నిర్వాహకులు డాక్టర్ అస్లాం తెలిపారు.
ఉదాహారణకు భోపాల్ - హైదరాబాద్ మధ్య దూరం 850 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో దాదాపు 14 గంటలపైనే పడుతుంది. అదే.. ఎయిర్ అంబులెన్సులో అయితే.. గంటన్నరలో ఓ రోగిని నగరానికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించవచ్చు. ఈ కారణంతో కూడా ఎయిర్ అంబులెన్స్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఈ ఎయిర్ అంబులెన్స్‌లో రోగితోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు, సంబంధిత ఆస్పత్రి డాక్టర్, నర్సు వెళ్లొచ్చు. గడిచిన 2 నెలల్లో రాజస్థాన్, బిహార్, దిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి దాదాపు 25-30 మంది కరోనా రోగులను ఎయిర్ అంబులెన్సు ద్వారా నగరానికి తీసుకొచ్చారు.