హఠాత్తుగా లాక్‌డౌన్ ను ఎలా అనౌన్స్ చేస్తారంటూ.. హై కోర్టు ఆగ్రహం..!
High Court Serious On Telangana Govt. హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అని ప్రకటిస్తే ఇంత తక్కువ సమయంలో
By Medi Samrat
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ పదిరోజుల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సమయంలో నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన భైటీ అయిన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అని ప్రకటిస్తే ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడగా.. ఈసారి అలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
లాక్ డౌన్ ప్రకటనతో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండటంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు హడావిడిగా ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇలా అందరూ ఒకే చోట చేరడంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.