తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియ‌స్‌

High Court Serious On Telangana Govt. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్య‌క్తం చేసింది.

By Medi Samrat
Published on : 19 April 2021 3:13 PM IST

Telangana HC

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో నేడు విచారణ జ‌రిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్య‌క్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ప్ర‌భుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సినిమా హాల్ లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఇక రాష్ట్ర‌ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదన్న హైకోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది.

జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిపై హైకోర్టు.. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే.. ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారూ? అని ప్ర‌‌శ్నించింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అంటూ క‌న్నెర్ర జేసింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నం లోగా నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామన్న హైకోర్టు.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.


Next Story