సమగ్ర శిక్షా పథకంలో భారీ కుంభకోణం? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 'సమగ్ర శిక్షా' పథకం కింద భారీ స్థాయిలో ...

By -  అంజి
Published on : 25 Feb 2026 10:29 AM IST

Telangana High Court Notices, Samagra Shiksha Scheme Fraud, Telangana School Education Department Scam, PM Shri Schools Corruption Allegations, Advocate Rapolu Bhaskar PIL, Telangana Education News 2026

సమగ్ర శిక్షా పథకంలో భారీ కుంభకోణం? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 'సమగ్ర శిక్షా' పథకం కింద భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరియు సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేస్తూ, మూడు వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)గా స్వీకరించిన కోర్టు ఈ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్' కింద పీఎం శ్రీ (PM Shri), సమగ్ర శిక్షా పాఠశాలల స్థాపన కోసం కోట్లాది రూపాయలను కేటాయించింది. పేద విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. తెలంగాణలో ఇలాంటి 946 పాఠశాలల కోసం బిడ్లను ఆహ్వానించగా, 500 బిడ్లను ఆమోదించారు. అయితే, విద్యాశాఖలోని కొందరు ఉన్నతాధికారులు తమకు నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు బిడ్డర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని పిటిషనర్ ఆరోపించారు.

ఈ అవినీతి కారణంగా 2024-25 సంవత్సరానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో జాయింట్ డైరెక్టర్-II గా ఉన్న వెంకట నరసమ్మ వివిధ బిడ్డర్ల నుంచి భారీగా లంచాలు తీసుకున్నారని పిటిషన్‌లో పేరును ప్రస్తావించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వం సమర్పించే వివరణ ఆధారంగా హైకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది.

Next Story