నల్గొండ జిల్లా మునుగోడులో ఓటర్ల నమోదుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు బై ఎలక్షన్స్ సందర్భంగా నమోదైన.. ఓటర్ల జాబితా రిపోర్ట్‌ను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తరఫున లాయర్ రచనారెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా రూల్స్‌కు వ్యతిరేకంగా ఓటర్ల నమోదు జరిగిందని న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు.
ఫార్మ్-6 ప్రకారం.. కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని న్యాయవాది తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని ఆమె వివరించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం తరపున అవినాశ్ దేశాయ్ తన వాదనలు వినిపించారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైందని.. నవంబర్ 3న పోలింగ్ జరుగనుందని తెలిపారు. అయితే తుది ఓటర్ల జాబితాను ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని కోర్టుకు వివరించారు.
గతేడాది జనవరి వరకు మునుగోడులో 2 లక్షల 22 వేల ఓట్లు ఉన్నాయని, ప్రస్తుతం నియోజకవర్గంలో 2 లక్షల 38 వేల ఉన్నాయని హైకోర్టుకు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తెలిపారు. కొత్తగా నమోదైన 25 వేల ఓట్లలో 7 వేల ఓట్లు తొలగించామని చెప్పారు. ఓటర్ల నమోదు ప్రక్రియ అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగిందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఈ నెల 31 వరకు సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను స్తంభింపజేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది.