ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా?.. ఈ అర్హతలు ఉండాల్సిందే
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.
By అంజి Published on 12 Oct 2023 6:15 AM GMTఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా?.. ఈ అర్హతలు ఉండాల్సిందే
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఆయా పార్టీల టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఔత్సాహిక అభ్యర్థులు, టికెట్లు రాని వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చా? ఈ పోటీకి ఏమైనా పరిమితులు ఉంటాయా? వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే.. నామినేషన్ల పరిశీలన రోజు నాటికి 25 ఏళ్లు పూర్తై ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173(బీ) ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితంగా 25 ఏళ్లు నిండాలి. అలాగే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో పోటీ చేసేవారు ఆయా వర్గాలకు చెందినవారై ఉండటంతో పాటు, కాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 4, 5 దీనికి అనుమతి ఇస్తున్నాయి. అయితే ఓ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి.. మరో రాష్ట్రంలో పోటీ చేయడానికి వీలు లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇలాంటి ఛాన్స్ లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన వారు కూడా పోటీకి అనర్హులు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఎన్నికలలో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందే. అలాగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 34(1) ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఈ మొత్తంలో డిస్కౌంట్ ఉంటుంది. వారు రూ. 5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. ఎస్సీ, ఎస్టీలు జనరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. ఎన్నికల్లో ఆరింట ఒక వంతు ఓట్లు సాధిస్తే అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం వెనక్కు ఇస్తారు.
అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు ఎన్నికల అధికారికి తమ నామినేషన్ సమర్పించాలి. అలాగే నామినేషన్ వేసేటప్పుడు వారి అభ్యర్థిత్వాన్ని ఇతరులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(1) ప్రకారం.. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్, స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ఈసీఐ దగ్గర రిజిస్టరైనా ఇంకా గుర్తింపులేని పార్టీలు నుంచి పోటీ చేసే అభ్యర్థులకూ 10 మంది ప్రపోజర్లు ఉండాలి.
తగినంత మంది ప్రపోజర్లు లేకపోతే వారి నామినేషన్లు తిరస్కరించబడతాయి. అలాగే ప్రపోజర్లకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలి. నామినేషన్ టైమ్‌లో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలూ ఆ అఫిడవిట్‌లో ఉండాలి. అభ్యర్థి.. రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటాననే ప్రమాణ పత్రం నామినేషన్ల సమయంలో సమర్పించాలి. నామినేషన్‌ల సమయంలో ఎన్నికల అధికారి అడిగే ఏ సర్టిఫికెట్‌నైనా అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నామినేషన్ల పరిశీలన తుది గడువు వరకు సమయం ఉంటుంది.
నామినేషన్లు వేసేటప్పుడు అభ్యర్థి పెద్దసంఖ్యలో జనాన్ని తీసుకుని వెళ్లడానికి వీల్లేదు. అభ్యర్థి సహా మొత్తం అయిదుగురు మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది. నామినేషన్ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఆయన ఎలక్షన్ ఏజెంట్, ఆయన ప్రపోజర్లలో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొచ్చు.