'చచ్చినా.. బతికినా తెలంగాణ కోసమే'.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఉద్వేగం

స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆవేశంగా చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేట్టు చెప్పినా, అర్థం చేసుకుని చెప్పినా...

By -  అంజి
Published on : 4 Jan 2026 6:33 AM IST

CM Revanth, emotional speech, Telangana Assembly, Water Facts

'చచ్చినా.. బతికినా తెలంగాణ కోసమే'.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఉద్వేగం

“స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆవేశంగా చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేట్టు చెప్పినా, అర్థం చేసుకుని చెప్పినా, నా ఆలోచన ఒక్కటే.. ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి. చిన్న వయసులోనే దేవుడు నాకొక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా దేవుడు నాకీ అవకాశమిచ్చిండు.

ఆశామాషీ విషయం కాదు. ఇదొక గొప్ప బాధ్యత. దీన్ని దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా. ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. ఇది దేవుడి మీద ఆన. ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వను..” అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాసనసభలో ఉద్వేగంగా చెప్పారు.

'నీళ్లు – నిజాలు' అన్న అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై ముఖ్యమంత్రి సవివరమైన సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాలు, రాష్ట్రాల మధ్య కేటాయింపులు, జల వివాదాలు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, విపక్ష విమర్శల వంటి అన్ని అంశాలపైనా స్పష్టమైన సమగ్రమైన సమాచారాన్ని సభకు తెలియజేశారు.

ప్రతి సందర్భంలోనూ సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభమైన ప్రాజెక్టుల వివరాలను అందించారు. వాటి ఆధారంగానైనా గతం ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కుల కోసం ప్రయత్నించలేదని ఎత్తిచూపారు. ప్రాజెక్టులను పట్టించుకోలేదని చెప్పారు.

చర్చపై సమాధానమిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ హక్కులకు నష్టం కలిగించే ఏ చిన్న తప్పు కూడా చేయనని దేవుడిపై ప్రమాణం చేశారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో సమిష్టిగా పనిచేస్తామని చెప్పారు.

“నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ. ఆ తర్వాత నాయకుడు. సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తించను. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించిన చరిత్ర నాది. ఆ ప్రాజెక్టు పనులను ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పిన చరిత్ర మాది.

ఆ ప్రాజెక్టు పనులు ఆపారో లేదో నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చు. చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే. చీమునెత్తురున్న వారు తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెడతారా?. తెలంగాణ హక్కులను ఎవరు భంగం కలిగించినా నిటారుగా నిలబడి కొట్లాడుతా. పాలమూరు కట్టి తీరుతామని కంకణం కట్టుకుని బయలుదేరితే విమర్శలు చేస్తారా..” అంటూ ప్రశ్నించారు.

“పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి దశలో 45 టీఎంసీలు, రెండో దశలో మరో 45 టీఎంసీలతో పూర్తి చేయాలని కంకణం కట్టున్నాం. మొదటి విడత 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. ఈలోగా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు సాధించి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం సైనికుల్లా నిరంతరం పనిచేస్తున్నాం..” అని చెప్పారు.

Next Story