అసెంబ్లీలో సన్నబియ్యం బోనస్ రగడ.. కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఉత్తమ్‌

తెలంగాణ శాసనసభలో సన్నబియ్యం బోనస్ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

By -  అంజి
Published on : 23 March 2026 11:43 AM IST

Telangana Assembly, Fine Rice Bonus, Uttam Kumar Reddy, Harish Rao, Paddy Procurement, Rice Export to Philippines, Telangana Agriculture, Sona Masuri Demand, Budget Allocation

అసెంబ్లీలో సన్నబియ్యం బోనస్ రగడ.. కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఉత్తమ్‌

తెలంగాణ శాసనసభలో సన్నబియ్యం బోనస్ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గత యాసంగి సీజన్‌లో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం సుమారు రూ. 1100 కోట్ల బోనస్ బకాయి పడిందని, ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుంటూ.. స్పష్టమైన గడువు చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

విపక్షాల ప్రశ్నలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే బడ్జెట్‌లో రూ. 3,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు నగదు చెల్లించామని, మిగిలిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, మన సోనా మసూరి, బాస్మతి రకాలకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో బియ్యం కుంభకోణం జరిగిందని, గత పాలనలోని అక్రమాలన్నింటిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగిస్తామని మంత్రి సభకు వివరించారు.

Next Story