జగిత్యాలలో అమానుషం: బతికుండగానే వ్యక్తిని శ్మశానంలో వదిలేసిన కుటుంబ సభ్యులు

జగిత్యాల పట్టణంలో మనసును కలచివేసే అమానుష ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎండ్రికాయల శ్రీధర్...

By -  అంజి
Published on : 21 March 2026 9:00 AM IST

Jagtial News, Abandoned at Graveyard, Family Negligence, Kidney Failure Patient, Saudi Returnee, Jagtial District Hospital, 108 Ambulance Service, Humanity Crisis

జగిత్యాలలో అమానుషం: బతికుండగానే వ్యక్తిని శ్మశానంలో వదిలేసిన కుటుంబ సభ్యులు

జగిత్యాల పట్టణంలో మనసును కలచివేసే అమానుష ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎండ్రికాయల శ్రీధర్ (49) అనే వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యులు బతికుండగానే చింతకుంట శ్మశానవాటికలో వదిలి వెళ్లారు. మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన శ్రీధర్‌కు భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన శ్రీధర్, అక్కడ మంచి వేతనం పొందుతున్నప్పటికీ, జల్సాలకు అలవాటుపడి తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో భార్య సునీత ఇక్కడ కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ తన పుట్టింటికి వెళ్లిపోయారు.

ఇటీవల శ్రీధర్ సౌదీలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో, ఆయన పనిచేస్తున్న కంపెనీ స్వదేశానికి పంపించివేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కొంతకాలం చికిత్స అందించినప్పటికీ, ఆయన మూత్రపిండాలు దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో, భారంగా భావించిన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఆయనను శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న స్థానికులు శ్రీధర్ దీనస్థితిని గమనించి, వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.

108 సిబ్బంది సకాలంలో స్పందించి శ్రీధర్‌ను జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తన భార్య, సోదరుడు తనను పట్టించుకోవడం లేదని శ్రీధర్ ఆసుపత్రిలో వాపోయారు. అయితే, శ్రీధర్ గతంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే కుటుంబం దూరం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Next Story