తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

Health Minister Harish rao started mothers milk bank in petlaburuj. బిడ్డకు తల్లి పాలే ముద్దని, డబ్బా పాలు వద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని

By అంజి  Published on  5 Aug 2022 9:50 AM GMT
తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

బిడ్డకు తల్లి పాలే ముద్దని, డబ్బా పాలు వద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పేట్ల బురుజు ప్రభుత్వాసుపత్రిలో తల్లి పాల బ్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అన్నారు. తల్లి పాలు అంత శ్రేష్ఠమైనది ఏదీలేదని, తల్లి పాలు అమృతంతో సమానం అని అన్నారు. వీటిని మరి దేంతో పోల్చలేం అన్నారు.

ఎన్‌ఎస్‌యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశ్యంతో పేట్ల బురుజులో పాల బ్యాంక్‌ను ప్రారంభించామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి పాల వారోత్సవాన్ని జరుపుతోందని అన్నారు. తల్లి పాలపై అవగాహనం పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం 36 శాతం మంది పిల్లలకు మాత్రమే మొదటి గంటలో తల్లి పాలు అందుతున్నాయని, 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలు అందడం లేదని తెలిపారు.

తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారని, సీ సెక్షన్ ఆపరేషన్ల వళ్ల ఇది జరుగుతుందని అన్నారు. నార్మల్‌ డెలివరీ పట్లు మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు. ''కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేసుకుంటున్నారు. మరి కొద్ది మంది మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇవేవి సరైన పద్ధతులు కావు. వైద్యుల సూచన మేరకే ముందుకెళ్లాలి'' అని మంత్రి హరీష్‌ రావు సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్‌లు గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యత గురించి చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో 45 శాతం సి సెక్షన్ జరుగుతోందని మంత్రి హరీష్ రావు చెప్పారు. 55 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని వివరించారు. మదర్ మోర్టాలిటీ రేట్‌లో తమిళనాడును అధిగమించామని గుర్తు చేశారు. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.

Next Story
Share it