ఇటువంటి ప‌రిస్థితుల‌లో ఆ కోణంలో ఆలోచించడం సబబు కాదు

Health Minister Etela Rajendar Press Meet. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on  27 April 2021 2:54 PM GMT
Etala Rajendra

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నిబంధనల మేరకే ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు వసూలు చేయాలని హెచ్చ‌రించారు. కరోనాతో రోగి చనిపోతే డబ్బుల కోసం ఒత్తిడి చేయకుండా.. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో ప్రజలను వేధించే పద్ధతులను సభ్య సమాజం హర్షించదని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంటే ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఈటల వెల్లడించారు.

రెమ్ డెసివిర్ లభ్యత లేకుంటే తామే అందించే ఏర్పాటు చేస్తున్నామని, తాము ఇంత గొప్పగా సహకరిస్తున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు కనికరం లేకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అయితే అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇలా చేస్తున్నాయని భావించడంలేదని, కొన్ని ఆసుపత్రులే ఇలాంటి ధోరణులకు పాల్పడుతున్నాయని ఈటల అభిప్రాయపడ్డారు. అవకాశం వచ్చింది కదా.. ఇప్పుడే సంపాదించుకుందాం అనే కోణంలో ఆలోచించడం సబబు కాదన్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని, సైన్యం సాయంతో ఆక్సిజన్ రవాణా చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం అని, రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆక్సిజన్ వ్యవహారాల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించామని మంత్రి వెల్లడించారు.


Next Story